గత డెబ్బై రోజులుగా కృష్ణానదిలో, నలబై రోజులుగా గోదావరిలో వరద కొనసాగుతోంది.
ప్రతికూల పరిస్థితి వల్ల రీచ్ ల నుంచి ఇసుకను తీయలేకపోతున్నాం.
ఇసుక కొరత వల్ల నిర్మాణ పనులు మందగించకుండా ప్రత్యామ్నాయ చర్యలు.
భవన నిర్మాణ కార్మికుల ఉపాధికి ఇబ్బంది లేకుండా చర్యలు.
పట్టా భూముల ద్వారా నిర్మాణాలకు ఇసుకను అందిస్తున్నాం.
ఇప్పటి వరకు 82 పట్టాభూముల యజమానులతో అగ్రిమెంట్లు.
వాటిల్లో పది పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు కూడా ఇచ్చేశాం.
రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గనుల శాఖామంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సచివాయలంలో మైనింగ్ శాఖ కార్యదర్శి రామ్ గోపాల్ తో కలిసి ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కృష్ణా , గోదావరినదుల్లో వరద కొనసాగుతోందని, దీనివల్ల ప్రధానమైన రీచ్ ల నుంచి ఇసుకను అందించలేక పోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ ప్రకటించిన తరువాత ప్రారంభంలో అయిదు వేల టన్నుల ఇసుకను అందించగా, నేడు దానిని నలబై అయిదు వేల టన్నుల మేరకు పెంచగలిగామని తెలిపారు. గత పదేళ్లలోని వర్షాభావ పరిస్థితులకు భిన్నంగా ఈ ఏడాది సంవృద్దిగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. దీనివల్ల కృష్ణానదిలో డెబ్బై రోజులుగా, గోదావరిలో నలబై రోజులుగా వరద కొనసాగుతోందని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఇసుక కొరత ఉత్పన్నమైందని, దీనిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఇసుక రీచ్‌లను గుర్తిస్తున్నామని అన్నారు. ఇప్పటికే పట్టాభూముల్లో మేట వేసిన ఇసుకను
తొలగించేందుకు టన్నుకు వంద రూపాయలు చొప్పున చెల్లిస్తామని భూయజమానులతో ఒప్పందాలు చేసుకుంటున్నామని అన్నారు. ఇప్పటికే ఎనబై రెండు మంది పట్టా భూముల యజమానులు ఇసుక తవ్వకాల కోసం ఒప్పందాలు చేసుకున్నారని, వారిలో పది పట్టాభూములకు అనుమతి కూడా ఇచ్చామని వెల్లడించారు. మరో పదిహేను రోజుల్లో ఇసుక కొరత లేకుండా అడిగిన వారందరికీ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ముప్పై ఆరువేల మంది దరఖాస్తు దారులకు ఆరులక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను సరఫరా చేశామని తెలిపారు. క్రెడాయ్, రియల్ ఎస్టేట్ అసోసియేషన్ లతో మాట్లాడి, వారి అవసరాలకు కూడా దాదాపు యాబై వేల టన్నుల ఇసుకను అందించామని తెలిపారు. ఈ రెండు నిర్మాణరంగ అసోసియేషన్ లతో సమావేశాలు నిర్వహించి, వారి అవసరాలు ఎంత, ఏ మేరకు ఇసుకను అందించాలో అవగాహనకు వచ్చామని తెలిపారు.